ధ్యాన యోగం

by SanatanaDharmam
Dhyana Yogam

ధ్యాన యోగంలో 1వ భాగం

ఆస్తికులమైన మనకు వేదాలు పరమ ప్రమాణాలు.

వేదాలు

వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం అని నాలుగు విభాగాలు. కాని, యధార్ధానికి మొదటి మూడే వేదాలని అంగీకరిస్తూ వీటిని త్రయీ విద్య అంటారు — వేదత్రయం అని. నాల్గొవదైన అధర్వ వేదం, పై మూడు వేదాల సారాంశం అని అంటారు. ఋగ్యజున్సామవేదాలను కాండత్రయమని కూడా అంటారు. ఎందు చేతనంటే — ఋగ్వేదం జ్ఞాన కాండను, యజుర్వేదం కర్మ కాండను, సామవేదం ఉపాసనా కాండను (భక్తి కాండను) చెపుతున్నాయి. నాల్గొవదైన అధర్వవేదం విజ్ఞాన కాండను చెపుతోంది — ఈ మూడు కాండల సారము ఇందులో (విజ్ఞాన కాండలో) ఉన్నదని భావం.

ఋగ్వేదం

జ్ఞాన కాండ, దీనిలో ఈశ్వరుని మొదలు జీవ పర్యంతం, తృణపర్యంతం, సమస్త పదార్దాలను స్తుతించటం, వాటి పరిభాషను చెప్పటం ద్వారా ఈశ్వరునికి సమస్త జగత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించటం జరిగింది. ఈ జ్ఞానాన్ని పొందినందువల్ల కర్మలందు ప్రవృత్తి యోగ్యత లభిస్తుంది.

యజుర్వేదం

కర్మకాండ, ఇందులో ధర్మంతో కూడినట్టి ఇహలోక – పరలోకాలకు సంబంధించిన కర్మ పద్ధతులు వివరింప బడ్డాయి. వీటికి, ఈ కర్మలకు ఫలితం ఉపాసనా యోగ్యత సిద్ధించటం.

సామవేదం

ఉపాసనా కాండ, దీనికి ఫలం విజ్ఞానం (విశేషజ్ఞానం) అనవచ్చు. విజ్ఞానమంటే బ్రహ్మవిద్య. దీని పరిణామ స్వరూపమే మోక్ష ప్రాప్తి. ఈ బ్రహ్మవిద్యయే ఉపాసనా కాండ కూడా! దీని సారమే అధర్వ వేదాంగ భూతమైన పరా విద్య. అందుచేతనే మనం బ్రహ్మవిద్యనే యోగ విద్య అని కూడా అనవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాన్నే మూడు విభాగాలుగా విభజించుకోవచ్చు.

  1. జ్ఞానయోగం (సాంఖ్యయోగం) దీనినే జ్ఞానకాండ అని ఋగ్వేద విద్య అని అనవచ్చు.
  2. కర్మయోగం దీనినే క్రియాయోగం, తపోయోగం, యజుర్వేద విద్య అని అనవచ్చు. దీనివల్ల — ఈ కర్మ యోగానుష్ఠానంవల్ల ముముక్షువు ఉత్తమాధికారి అవుతాడు.
  3. ఉపాసనాయోగం, దీనినే భక్తి యోగం, సామవిద్య అని అనవచ్చు. ఈ ఉపాసనా యోగాన్నే మళ్ళీ రెండుగా విభజిస్తారు. i) సమాధి యోగం ii) విజ్ఞాన యోగం అని, దృఢమైన భక్తి, శ్రద్ధ మొదలైన వాటివల్ల కలిగే సంప్రజ్ఞాతసమాధి అనేది సమాధి యోగానికి ఫలమైతే, విజ్ఞాన యోగంవల్ల ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. దీనినే పరావిద్య అంటారు. దీనివల్ల అసంప్రజ్ఞాత యోగం (నిర్వికల్పసమాధి) సిద్ధిస్తుంది, అదే మోక్షప్రాప్తి.

ఇప్పుడు మనం జ్ఞానయోగం, కర్మయోగం, ఉపాసనా యోగం అనేవాటిని గురించి తెలుసుకుందాం. చాలామంది వీటిని గురించిన జ్ఞానం, అవగాహన లేకుండానే, ఆసనాలు వగైరాలు నేర్చుకొని, గడ్డాలు మీసాలు పెంచి, అదే యోగమని భ్రమిస్తారు. నీవు దేనిని కోరుతున్నావో దానిని — గురించిన సరియైన జ్ఞానం లేనిదే ప్రయోజనం ఏమి ఉండదు. అధికారికి ఉండవలసిన లక్షణాల్లో శ్రవణ మనన నిదిధ్యాసలు ప్రధానం. ఈ యోగాన్ని గురించిన జ్ఞానం పొందటం, వేదశాస్త్రాల్లో యోగాన్ని గురించి ఏమేమి చెప్పబడి ఉన్నదో తెలుసుకోవటం, ప్రధానం. ఇదంతా శ్రవణం అనే దాని క్రిందకు వస్తుంది. వేదాల్లో, శాస్త్రాల్లో చెప్పబడిన విషయాలు, గురుముఖతః విన్న విషయాలు, వీటిమీద శ్రద్ధ ఉండాలని చెప్పాOకదా! విషయం బాగా తెలిస్తేనేగాని శ్రద్ధ పుట్టదు. అందుచేత ముందుగా జ్ఞానయోగాన్ని గురించి తెలుసుకుందాం.

Leave a Comment

Sanatana Dharmam